కాశి మూవీ రివ్యూ

కాశి మూవీ రివ్యూ

కాశి మూవీ రివ్యూ:

సినిమా పేరు: కాశి
నటీనటులు: విజయ్‌ ఆంటోనీ, అంజలి, నాజర్‌, జయప్రకాశ్‌, సునయన, అమృత అయ్యర్‌ తదితరులు
సంగీతం: విజయ్‌ ఆంటోనీ
సినీమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌
నిర్మాణ సంస్థ: విజయ్‌ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌
కూర్పు: లారెన్స్‌ కిశోర్‌
నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోనీ
దర్శకత్వం: ఉదయనిధి
విడుదల తేదీ: 18-05-2018
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు విజయ్‌ ఆంటోని. ఆయన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తోందంటే ఏదో ప్రత్యేకత ఉందని ప్రేక్షకులు ఆశిస్తారు. తాజాగా ఉదయనిధి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాశి’. అంజలి కథానాయిక. భావోద్వేగాలకు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కు పెద్దపీట వేసినట్లు విజయ్‌ ఆంటోని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదీకాకుండా విడుదలకు రెండు రోజుల ముందే సినిమాలోని తొలి ఏడు నిమిషాల సన్నివేశాలను యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ‘కాశి’ ఆ అంచనాలను అందుకున్నాడా? ‘బిచ్చగాడు’లా ‘కాశి’తో మరో హిట్‌ అందుకుంటాడా?

కథేంటంటే:

భరత్‌(విజయ్‌ ఆంటోనీ) అమెరికాలో పేరున్న వైద్యుడు. అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటాడు. అతనికి జీవితంలో ఏ లోటూ ఉండదు. రోజూ అతన్ని ఒక కల వెంటాడుతుంటుంది. ఒక పాము తనని కాటేయడానికి వచ్చినట్లు, ఓ వ్యక్తి తనను తరుముతున్నట్లు కల కంటుంటాడు భరత్‌. ఓరోజు భరత్‌కు ఓ నిజం తెలుస్తుంది. తానో దత్త పుత్రుడినని తనను కన్నవాళ్లు భారతదేశంలో ఉన్నారని తెలుస్తుంది. పెంచిన అమ్మానాన్నల అనుమతితో కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి భారత్‌ వస్తాడు భరత్‌. తన బాల్యం అంతా కంచెర్లపాలెం అనే ఓ గ్రామంలో జరిగిందని తెలుసుకుని అక్కడికి వెళతాడు. కంచెర్లపాలెంలో భరత్‌కు ఎదురైన అనుభవాలేంటి? తన అమ్మానాన్నల గురించి నిజం తెలిసిందా? అనేదే కథ.

ఎలా ఉందంటే:

‘బిచ్చగాడు’, ‘డాక్టర్‌ సలీం’, ‘నకిలీ’ లాంటి వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌. ‘బిచ్చగాడు’ సాధించిన విజయం టాలీవుడ్‌లో విజయ్‌ను మరింత పాపులర్‌ చేసింది. ఆ తర్వాత విజయ్ ‌నుంచి వచ్చిన ఏ చిత్రమూ ‘బిచ్చగాడు’లా కదిలించలేకపోయింది. అందుకే విజయ్‌ ఆంటోని ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న కథను ఎంచుకున్నాడు. ‘కాశి’ సినిమాలో ఓ బిడ్డ తన తల్లి జ్ఞాపకాలను వెతుక్కుంటూ చేసే ప్రయాణం మనసుకు హత్తుకుంటుంది. దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంటే ‘కాశి’ మరో ‘బిచ్చగాడు’ అయ్యేది. కానీ కథనంలో లోపాలు, పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం వల్ల ‘కాశి’ ఓ సగటు సినిమాలా మిగిలిపోతుంది. మొదటి పది నిమిషాలు ఆసక్తికరంగా నడిపిన దర్శకుడు అదే పట్టును తర్వాత సన్నివేశాల్లో కొనసాగించలేకపోయాడు.
కంచెర్లపాలెం గ్రామంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు కథకు ఏమాత్రం సంబంధం లేనివిగా అనిపిస్తాయి. ఒకే సినిమాలో మూడు ఉప కథలు ఉండడం, అందులో రెండు కథలతో అసలు కథకు సంబంధం లేకపోవడం ‘కాశి’కి ప్రతికూల అంశాలుగా మారాయి. తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. భరత్‌కి ఏదో బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది.. అనుకున్న ప్రేక్షకుడు నిరాశచెందుతాడు. భరత్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో మెరుపులు లేకపోవడంతో కథ, కథనాలు సాదాసీదాగా సాగడం, ప్రతి సన్నివేశాన్ని సాగదీయడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఇలాంటి కథల్లో వినోదం ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అయితే దర్శకుడు అక్కడక్కడా కొన్ని సెటైర్లు వేసి ఉపశమనం కలిగించాడు. కొన్ని సన్నివేశాలు, ఉపకథల్లో కొన్ని ఘట్టాలు బాగానే ఉన్నప్పటికీ అవేవీ ‘కాశి’ని గట్టెక్కించలేకపోయాయి.

ఎవరెలా చేశారంటే:

తన తొలి సినిమా నుంచి ఒకే రకమైన హావభావాలతో బండి నడిపిస్తున్నాడు విజయ్‌ ఆంటోనీ. ఈ సినిమాలోనూ అలాగే కనిపించాడు. రకరకాల గెటప్‌లు వేసుకున్నా ప్రతి గెటప్‌ ఒకేలా ప్రవర్తిస్తుంది, ఒకేలా మాట్లాడుతుంది. తన నటన గురించి ఇస్తున్న హావభావాల గురించి విజయ్‌ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అంజలిది చిన్న పాత్రే. కథానాయిక అని చెప్పుకొన్నా ఆమె పాత్రకున్న ప్రాధాన్యత అంతంతమాత్రమే. నాజర్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో రాణించారు. మిగిలిన వాళ్లంతా తమిళ నటీనటులే. విజయ్‌ ఆంటోనీ అందించిన పాటల్లో కొన్ని బాగున్నప్పటికీ అవి కథా గమనానికి అడ్డుపడ్డాయి. తమిళ పాటల్లోని సాహిత్యాన్ని మక్కీకి మక్కీ అనువదించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్ని కుదించుకుంటే బాగుండేది. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం, పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి.
బలాలు:
+ తొలి పది నిమిషాలు
+ క్లైమాక్స్‌
బలహీనతలు:
- ఉప కథలు ఎక్కువయ్యాయి
చివరగా: అసలు కంటే కొసరు ఎక్కువ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

RELATED NEWS

Comment