సినిమా టికెట్ ధరల పెంపుపై త్వరలో నిర్ణయం – టాలీవుడ్ దర్శక నిర్మాతలతో భేటీలో మంత్రి తలసాని

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద నిర్మాతలు, దర్శకులతో సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. థర్డ్ వేవ్, థియేటర్స్ ఆక్యుపెన్సీ ఇతర సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యెర్నేని నవీన్, అభిషేక్ నామా, ప్రమోద్, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు.

తలసాని మాట్లాడుతూ…లాక్ డౌన్, రెండు వేవ్ ల తర్వాత సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ పరిశ్రమపై వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీ వంద శాతం అనుమతి ఇచ్చాం. అది అలాగే కొనసాగుతుంది. థర్డ్ వేవ్ వస్తుందనే భయాలు వద్దు. మళ్లీ లాక్ డౌన్ పెడతారు, థియేటర్స్ మూసేస్తారనేవి అపోహలు మాత్రమే. ప్రభుత్వానికి అలాంటి ఆలోచనలు లేవు. థియేటర్లు పూర్తిగా తెరిచినా ప్రేక్షకులు అంతంత మాత్రమే వస్తున్నారు. స్టార్ల సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వస్తారు. దర్శకనిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. సినిమాల రిలీజ్ లను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. టికెట్ ధరల పెంపు విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తాం. అన్నారు.

Related Posts