నేల టిక్కెట్టు మూవీ రివ్యూ&రేటింగ్

నేల టిక్కెట్టు మూవీ రివ్యూ&రేటింగ్

రివ్యూ : నేల టిక్కెట్టు
తారాగణం : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, రవితేజ, ప్రియదర్శి, అలీ, ప్రవీణ్, బ్రహ్మానందం తదితరులు.. 
సంగీతం : శక్తికాంత్ కార్తీక్ 
సినిమాటోగ్రఫీ :  ముఖేష్ జి
నిర్మాత : రామ్ తాళ్లూరి
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల 
రిలీజ్ డేట్ : 25.05.18
 
 
మాస్ రాజా రవితేజ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఒకప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. బయ్యర్స్ నుంచి ఆడియన్స్ వరకూ ఇదే పరిస్థితి. అయినా అవే రొటీన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడీ ఊర మాస్ రాజా. 
 
ఇవాళ విడుదలైన నేల టిక్కెట్టు ట్రైలర్ తోనే ఇది కూడా మాస్ ఎంటర్టైనర్ అనిపించారు. కానీ కథనంలో ఏమైనా కొత్తదనం ఉందేమో.. ఓ భూతద్దం తెచ్చుకుని వెదికే ప్రయత్నం చేద్దాం.. 
 
కథ(లేదు.. కానీ వెదుకుదాం) :
ఓ అనాథ(రవితేజ). వైజాగ్ లో మిత్రులతో కలిసి ఉంటుంటాడు. కోర్ట్ లో అబద్ధపు సాక్ష్యాలు చెబుతూ.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటాడు. తనకు మరో ముగ్గురు అనాథ మిత్రులు ఉంటారు. ఓ సారి సిటీ పోలీస్ కమీషనర్ దొంగకోళ్లు పట్టాడంటూ అబద్ధపు సాక్ష్యం చెబుతాడు రవితేజ. దీంతో ఆ సిపి పగబట్టి చిన్న చిన్న కేసులన్నీ ఇతనిపై బనాయిస్తుంటాడు. ఇది తట్టుకోలేక ఓ రోజు సడెన్ గా హైదరాబాద్ కు చెక్కేస్తారు. అక్కడ లాయర్ (ప్రియదర్శి) మిత్రుడి ఇంట్లో ఉంటారు. ఇక్కడా ‘దీనజన రక్షణ’చేస్తూ హీరో అనిపించుకుంటాడు. ఆ క్రమంలో ఓసారి హోమ్ మినిస్టర్ తమ్ముడిని కొట్టి కొందరు వృద్ధుల పెన్షన్ డబ్బులు ఇప్పిస్తాడు. అక్కడి నుంచి హోమ్ మినిస్టర్(జగపతిబాబు) తో వైరం మొదలవుతంది. మరోవైపు హోమ్ మినిస్టర్ తన తండ్రినే చంపుతాడు. ఆ విషయం ఓ చానల్ రిపోర్టర్ కనిపెడుతుంది. దీంతో ఆ అమ్మాయిపై అటాక్ చేస్తారు అతని మనుషులు. ఇటు రోజురోజుకు రవితేజకు హోమ్ మినిస్టర్ గొడవ ముదురుతుంది. దీంతో ఓ దశలో అసలు తను సిటీకి వచ్చిందే నీకోసం.. ప్లాన్డ్ గా నీ పై అటాక్ చేస్తున్నానంటూ షాక్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంటర్వెల్.. తర్వాత ఏం జరిగి ఉంటుందో పెద్దగా ఆలోచించే స్కోప్ లేకుండానే ప్రతి సీన్ ముందే తెలిసిపోతూ ఉంటుంది.. అది తర్వాత కథ. 
 
విశ్లేషణ   : 
నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు.. ఇది సినిమాలో ఓ డైలాగ్..నిజమే.. నేల టిక్కెట్టు చూసిన వాళ్లతోనూ అదే పనిచేయించారు. అసలు మాట్లాడితే హీరోలను అనాథలను  చేయడమేంటో అర్థం కాదు. ఇలాంటి కథలు వెండితెరపై ఎన్ని వచ్చాయో లెక్కేలేదు.కనీసం కొత్త ప్లాట్ కూడా కాదు. గతంలో రవితేజనే చేసిన బెంగాల్ టైగర్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సినిమా మొదలుపెట్టడం నుంచి ముగించే వరకూ ఒక్కటంటే ఒక్కటీ ఇంట్రెస్టింగ్ సీన్ లేదంటే అర్థం చేసుకోవచ్చు.. దర్శకుడు ఎంత క్రియేటివిటీ లేమితో బాధపడుతున్నాడో. పెన్నుకు ఏది తోస్తే అది రాసుకున్నట్టు చాలా సీన్స్ చెబుతాయి. మామూలుగా ఏ కథైనా టేకాఫ్ అవుతూ వెళుతుంది. కానీ ఈ కథ టేక్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఎగిరేది ఎక్కడ. అలాగే ముగింపు కూడా చాలా అథమస్థాయిలో ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత రెండు సినిమాలు బాగా ఆడాయి. ఇక రవితేజతో సినిమా చేస్తున్నంత మాత్రాన కథనం విడిచి సాము చేయక్కర్లేదు. కనీసం కొన్నైనా కన్విన్సింగ్స్ ఉండాలి. అదీ లేదు. ఓ సాధారణ యువకుడు ఏకంగా హోమ్ మినిస్టర్ ను ఢీ కొట్టడం.. సరే ఢీ కొట్టాడు అనుకున్నా.. అందుకు తగ్గ బేస్ రాసుకోవలి కదా.. లేదు. ఇక కమెడియన్స్ చాలామంది ఉన్నా.. మా పని నవ్విచండం కాదు అని స్టాంప్ వేసుకున్నట్టుగా ఉంటుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ చూస్తే దర్శకుడి రైటింగ్ పై జాలిపడతాం. మరీ ఇంత చవకబారుగానా..? ఓ ఫైట్ చేయగానే హీరోయిన్ వచ్చి హీరో ఒడిలో వాలిపోతుందా.. ఇంకా ఎక్కడున్నారయ్యా బాబూ. ఓ వైపు మన కథలు మారుతున్నాయి అనుకుంటుంటే.. మళ్లీ ఇలాంటి అథమస్థాయి స్క్రీన్ ప్లేస్ ఏంటో అర్థం కాదు. అసలు ఈ దర్శకుడేనా గత రెండు సినిమాలు చేసింది అనే డౌట్ ప్రతి సీన్ కూ కలుగుతుంది. ఆ స్థాయిలో ఉంది అతని ‘ప్రతిభ’. 
ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రయోగాలు చేయను అన్నాడు. అది అతనిష్టం. మరి ఈ కథలేంటీ..? ఇంత చవకబారు కథల్లో అతను మాస్ రాజాగా చెలరేగిపోతే ఆడియన్స్ విజిల్స్కొ డతానుకున్నాడా..? అదే నిజమైతే అతనికి ప్రేక్షకులపై కూడా చవకబారు అంచనాలున్నట్టే. గత పదిపదిహేను సినిమాలుగా అతని బాడీ లాంగ్వేజ్ లో ఏ మార్పూ లేదు. అవే అరుపులు కేకలు. ఒక రకమైన డైలాగ్ మాడ్యులేషన్. ఇంకా అతన్ని నమ్మి నిర్మాతలు ఇంత బడ్జెట్( అతని గత సినిమా టచ్ చేసి 27కోట్లకు అమ్మితే వచ్చింది 10కోట్లే) పెడుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు ఏ మాత్రం కొత్తదనం లేని నటన చూపించిన రవితేజ ఇక తన నుంచి కొత్త సినిమా ఆశించడం మానేస్తే మంచిది అని నేల టిక్కెట్టుతో డిక్లేర్ చేశాడు.. అలాగే హీరోయిన్ పరిస్థితి. అమ్మాయి కాస్త అందంగానే ఉన్నా.. ఆమెకు పాటల్లో ప్రదర్శన తప్ప మరే పనీ లేదు. పోనీ ఆ పాటలైనా బావున్నాయా అంటే ఒక్కటీ బాలేదు. ఆ డ్యాన్సులేందో కూడా అర్థం కాదు. 
అసలే ఉన్న కథనమే అత్యంత భారంగా.. నడుస్తోంటే.. సెకండ్ హాఫ్ సగం అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అప్పటి వరకూ ఎలాగోలా ఓర్చుకున్న ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ మొదలు కాగానే.. ఛీఛీ అని ఏదో సినమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటారు. అన్నట్టు ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నాడండోయ్.. కానీ ఒక్కటీ ఎలివేషన్ సీన్ లేదు. ఈ సినిమాతో అతని స్థాయి ఎంత దిగజారిందో అర్థమైపతుంది. 
ఇక ఈ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి మాట్లాడాలి. సినిమా అంటే ప్యాషన్ ఉన్న ఎవరూ అనవసర ఖర్చుల వైపు వెళ్లరు. వెళ్లినా అవి కథనానికి అనుగుణంగా ఉండాలి. కాదూ కాస్ట్ లీ గా కనిపించాలి కాబట్టి నాలుగైదు స్కార్పియోలు పేల్చేస్తే ఎలా ఉంటుంది. ఈ సినిమాలో ఇలాంటి అనవసర ఖర్చులు చాలానే పెట్టించాడు దర్శకుడు. తెరనిండా ఆర్టిస్టులు.. అందరికీ ఒక్కడే దిక్కు. అతన్లేకపోతే ఆళ్ల బతుకులు బుగ్గే.. ఒక్క పాత్రా తిరగబడదు.. ఒక్క పాత్రా ప్రశ్నించదు. ఏంటో ఇదంతా.. పోనీ ఆ హీరోకైనా బలమైన సమస్య ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అత్యంత బలహీనమైన కథ ఇదే. కథనమూ ఈ సినిమాదే. ఈ మొత్తం మైనస్ పాయింట్స్ అన్నీ నిస్సందేహంగా దర్శకుడిపైనే వేయాలి. చాలా చోట్లా బాధ్యతా రహితంగా కనిపిస్తాడీ దర్శకుడు. ఇలాగే ఉంటే ఇకపై అతన్నుంచి మంచి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశే అవుతుంది.. 
ప్రేక్షకుల స్థాయిని నేలబారుగా ఊహించుకున్న దర్శకులే ఇలాంటి కథలతో వస్తారు. ఇక వారి కథలకు జై కొట్టే హీరోలను ఏమనాలో కూడా తెలియడం లేదు. కొత్త కథలక్కర్లేదు.. కనీసం కొత్తగా చెప్పే ప్రయత్నమైనా చేయాలి కదా.. చుట్టూ జనం మధ్యలో మనం.. కాన్సెప్ట్ బానే ఉంది.. కానీ చూసే జనం ఏమనుకుంటారో అన్న కనీస తెలివి చూపలేకపోయిన దర్శకుడి సినిమా ఇది. ఫైనల్ గా ఈ మధ్య కాలంలో చూసిన మరో పరమ బోరింగ్ సినిమా నేల టిక్కెట్టు.. హార్డ్ కోర్ రవితేజ అభిమానితో కూడా ఆపండ్రా బాబోయ్.. అనిపించే సినిమా నేలటిక్కెట్టు.. సారీ బాస్..  
 
టెక్నికల్ గానూ ఏ మాత్రం ఆకట్టుకోని సినిమా ఇది. మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్. సినిమాటోగ్రఫీ జస్ట్ ఒకే. పాటలు ఒక్కటీ అర్థం కాదు. మాటలు అత్యంత రొటీన్. ఆర్ట్ వర్క్ కూడా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తుంది. మొత్తంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా.. ఆ వాల్యూస్ ను టెక్నికల్ గా యాడ్ చేసుకోవడంలోనూ దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది.
 
 
రేటింగ్ : 0.5/5 
 
 

RELATED NEWS

Comment