పైసా వసూల్  రివ్యూ &  రేటింగ్   

పైసా వసూల్ రివ్యూ & రేటింగ్   

రివ్యూ    : పైసా వసూల్
తారాగణం    : బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్ సేథి, కైరాదత్, కబిర్ బేడి, విక్రమ్ జిత్, అలీ.. 
ఎడిటింగ్    : జునైద్ సిద్ధిఖీ
సినిమాటోగ్రఫీ    : ముఖేష్ .జి
సంగీతం    : అనూప్ రూబెన్స్ 
నిర్మాత    : వి ఆనంద్ ప్రసాద్
రచన,దర్శకత్వం    : పూరీ జగన్నాథ్ 
రిలీజ్ డేట్    : 01.09.17
జానర్    : యాక్షన్ ఎంటర్టైనర్ 

కొన్ని కాంబినేషన్స్ అంచనాలతో పాటు అనుమానాల్నీ పెంచుతాయి. అలాంటిదే పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబో. వీరిద్దరూ సినిమా చేస్తున్నారనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ ఇద్దరి స్కూల్స్ వేరు. పైగా పూరీ ఫ్లాపుల్లో ఉన్నాడు. బాలయ్య సెంచరీ పూర్తి చేసుకుని జోష్ లో ఉన్నాడు. అసలు పూరీ స్టైల్లో బాలయ్య ఎలా ఇముడుతాడా అనే డౌట్స్ కూడా చాలామందిలో ఉన్నాయి. మరి ఈ అనుమానాలు, ఆశ్చర్యాలకు బాలయ్య అండ్ పూరీ ఎలాంటి ఆన్సర్ చెప్పారో చూద్దాం.. 


కథ    : 
తేడా సింగ్(బాలకృష్ణ) ఓ గ్యాంగ్ స్టర్. తీహార్ జైలు నుంచి హైదరాబాద్ వస్తాడు. అతని బిహేవియర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ‘‘మందేసిన మదపుటేనుగులా’’ హ్యాండిల్ చేస్తుంటాడు. ఆ కాలనీలో ఉండే హారిక(ముస్కాన్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈ విషయమే ఓ బార్ లో డ్యాన్సర్ అయిన లేడీకి నచ్చుతుంది. కట్ చేస్తే బాబ్ మార్లే అనే ఓ మాఫియా డాన్ పోర్చుగల్ లో ఉంటూ.. ఇండియాలో అరాచకాలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన ఆఫీసర్స్ ను అతి కిరాతంగా చంపేస్తుంటాడు. దీంతో అతన్ని చంపాలంటే అతని రూట్ లోనే వెళ్లాలని తీర్మానిస్తుంది ‘రా’ ఏజెన్సీ. ఆ పని చేయాలంటే ఏ టార్గెల్ లేకుండా తిరుగుతోన్న తేడా సింగ్ కరెక్ట్ అని ఫీలై అతన్ని బాబ్ మార్లేను చంపడానికి ఒప్పిస్తారు. కానీ అసలతను తీహార్ జైలు నుంచి రాలేదని.. వేరే దేశం నుంచి ఇండియాకు వచ్చాడని.. తెలుస్తుంది. అంతేకాక హారిక అక్క సారికను చంపింది కూడా ఇతనే అని తెలుస్తుంది మరి తేడాసింగ్ అలా ఎందుకు చెప్పాడు. అసలు అతను ఇండియాకు ఎందుకు వచ్చాడు..? సారికను ఎందుకు చంపాడు.. బాబ్ మార్లేను చంపే పని పూర్తి చేశాడా లేదా అనేది మిగతా కథ.. 

విశ్లేషణ    : 
పూరీ జగన్నాథ్ ‘టచ్’ కోల్పోయి చాలాకాలం అయింది. పాత కథల్నే చెబుతూ వస్తూ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు పూరీ. ఈ సారీ పాత కథే. కానీ కొత్తగా బాలయ్య అనే పవర్ ప్యాక్ యాడ్ అయింది. ఓ మాఫియా డాన్.. అడ్డొచ్చినవాళ్లందరినీ అడ్డంగా కొట్టేస్తుంటాడు. బొమ్మాబొరుసు(చిత్తుబొత్తు అంటారు సినిమాలో) ఆడి ఓ ఇల్లు కబ్జా చేస్తాడు. ఆ ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయితో నువ్వంటే ఇష్టం అంటాడు. పొద్దున్నే ఇడ్లీ తెమ్మంటాడు.. అంతకు ముందు రాత్రి ఓ ధాబాలో ఆడిపాడి ఓ డ్యాన్సర్ ను ఇరవై వేలిచ్చి ఇంటికి తెచ్చుకుంటాడు.. కట్ చేస్తే మాఫియా గ్యాంగ్ తల చుట్టూ తుపాకులు పెట్టినా సింపుల్ డైలాగ్స్ తో వాళ్లందరినీ సిల్లీ ఫెలోస్ గా తేల్చేస్తాడు.. మళ్లీ వాళ్లతో గొడవపెట్టుకుని వాట్సాప్ లో నెంబర్లు డిలీట్ చేసేయండి, నాకు ఫోన్ చేయొద్దంటూ వార్నింగ్స్ ఇస్తాడు.. ఫైనల్ గా అతను మీరు చూస్తున్న పర్సన్ కాదు.. దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఓ పే..ద్ద కాప్ అంటూ ఫినిషింగ్ ఇవ్వడం... ఇలా మొత్తంగా ఏ సీన్ కూడా పూరీ మార్క్ ను దాటి ఉండదు. ఆ మార్క్ ను ఏ మాత్రం దాటకుండా కనిపించే బాలయ్య నటనే ఇక్కడ స్పెషల్ గా కనిపిస్తుంది తప్ప.. సీన్స్ కానీ, కథలో గానీ ఏ కొత్తదనం కనిపించదు. 


సింపుల్ గా చెప్పాలంటే  ప్రభాస్ పౌర్ణమి సినిమాలోని ప్లాట్ ను, పోకిరి సినిమా స్క్రీన్ ప్లేను ఎత్తేసి కుదించిన కథే పైసా వసూల్. కానీ బాలకృష్ణ వల్ల ఈ సినిమాకు అదనపు బలం వచ్చింది. బాలయ్య కూడా డైరెక్టర్ ఏం చెబితే అది బ్లైండ్ గా చేసుకంటూ వెళ్లిపోయాడు. అదే సినిమాలో మైనస్ లు కనిపించకుండా చేసింది. డైలాగ్స్ విషయంలో పూరీ పెన్ పవర్ మరోసారి కనిపిస్తుంది. ప్రతి డైలాగ్ తన మార్క్ లోనే సాగినా అన్నీ కొత్తగానే ఉంటాయి. అంటే పోకిరి టైప్ అన్నమాట. డైలాగ్ తోనే సీన్ ను ఎలివేట్ చేయడం లేదా హీరోయిజం పండించడం లాంటి ఫార్మాట్. ఇది బాలయ్య స్కూల్ కు పూర్తిగా కొత్త కాబట్టి కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇది బాలయ్య కెరీర్ లో ఇంతవరకూ చేయని పాత్ర.. బహుశా చేస్తానని ఆయన కూడా ఊహించని పాత్ర. అందుకే అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది. ఇక డైలాగ్స్ విషయంలోనూ బాలయ్య మార్క్ ను పూర్తిగా చెరిపేశాడు పూరీ. అందుకే ఈ పాత్ర అంతగా నచ్చి ఉంటుందాయనకు. కానీ ఈ పైపై మెరుగులు పట్టించుకున్నంత శ్రద్ధగా పూరీ కథను పట్టించుకోలేదు. కొన్నిసార్లు ఏది తోస్తే అది తీసుకుంటూ వెళ్లినట్టు కనిపిస్తుంది.. పోర్చుగల్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అయినా.. దాన్ని ఎఫెక్టివ్ గా చూపించడంలో పూరీ మార్క్ పూర్తిగా మిస్ అయింది. అలాగే ఎప్పుడు చూసినా మాఫియా డాన్ లు. వాళ్లను చంపే పోలీస్ లు, అమ్మాయిలతో విచ్చలవిడిగా మాట్లాడే హీరోలు మాత్రమేనా పూరీలో ఉన్న సత్తా.. అంతకు మించి ఇంకేం లేదా అనే ప్రశ్నకు ఈ సినిమా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎందుకంటే ఇంతకు మించి పూరీలో ఇంకేం లేదని కంప్లీట్ గా డిసైడ్ అవుతారు కాబట్టి.. కానీ డైలాగ్స్ తో మాత్రం చాలా చోట్ల చప్పట్లు కొట్టించాడు. కానీ కథలేకుండా ఎన్నాళ్లీ మాటలే నమ్ముకుంటాడో తెలియదు కానీ.. ఇది మరో పూరీ మార్క్ రొటీన్ కథ.. అయితే బాలయ్యకు పూర్తిగా కొత్త సినిమా. అందుకేనేమో పూరీ చాలా జాగ్రత్తగా ‘‘ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అవుటర్స్ ఆర్ నాట్ అలౌడ్’’అని ఇంటర్వెల్ తో పాటు ఎండింగ్ లోనూ వేశారు.. ఇది బాలయ్య అభిమానుల కోసమే అని అర్థమైనట్టేనేమో.. ఆర్టిస్టుల పరంగా ఇది బాలయ్య ఒన్ మేన్ షో. ఇలా ఎన్నో కథల్ని ఒంటి చేత్తో గట్టెంక్కించాడు కాబట్టి.. పెద్దగా ఇబ్బందేం లేదు. అయితే హీరోయిన్లు పూర్తిగా రాంగ్ చాయిస్. ఒక్కరి మొహంలోనూ ఎక్స్ ప్రెషన్ లేదు సరికదా ఆ మొహాలు కూడా చూళ్లేం. విలన్స్ అంతా వెరీ రొటీన్. అలీని రెండు సీన్లకు మాత్రమే పరిమితం చేశారు. శ్రియ ఒకే. పృథ్వీ పాత్రలో ఏ రసమూ లేదు. కబిర్ బేడీ పాత్ర పూర్తిగా తేలిపోయింది. 

టెక్నికల్ గా    : 
టెక్నికల్ టీమ్ అంతా పూరీ లాగే ఉంది.ఎవ్వరూ పెద్దగా అప్డేట్ అయినట్టు కనిపించలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ లో మూడు పాటలు ఒకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసో.. పూరీ మాటలు సూపర్బ్. కెమెరా వర్క్ బావుంది. ఆర్ట్ వర్క్ ఏ మత్రం ఆకట్టుకోదు. సెట్స్ మరీ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించినంత గొప్పగా అయితే లేవు.. 

ప్లస్ పాయింట్స్     : 
బాలయ్య
మాటలు 
ఫస్ట్ హాఫ్ 
పోర్చుగల్ ఎపిసోడ్ 
మూడు పాటలు 

మైనస్ పాయింట్స్   : 
కథ, కథనం 
దర్శకత్వం
చాలా అనవసర సీన్స్ 
కామెడీ 

ఫైనల్ గా    :  ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ .. అవుటర్స్ నాట్ అలౌడ్ 

రేటింగ్    : 2.75/5

RELATED NEWS

Comment