తెరాస ప్లీనరీ ప్రారంభం

తెరాస ప్లీనరీ ప్రారంభం

పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు అంకురార్పణ లక్ష్యాలతో హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు ‘తెలంగాణ ప్రగతి వేదిక’గా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్లీనరికి రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆటపాటలతో కళాకారులు అలరిస్తున్నారు.

రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ప్లీనరీ వేదిక కానుంది. ఇప్పటికే పార్టీ గ్రామ, మండల కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలే అధ్యక్షులుగా ఉంటారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఇతర సీనియర్‌ నేతలను నియమించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం ఇప్పటికే పునరుద్ఘాటించారు. దీనికి అనుగుణంగా ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వరప్రదాయినిగా తెరాస విశ్వసిస్తోంది. దీని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు నెలలకోసారి సర్వేలను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు లోటుపాట్లను సీఎం వివరిస్తున్నారు. 2019 ఎన్నికల బృందం ఇప్పటికే ఖరారైంది. ప్లీనరీ వేదికగా వీటన్నింటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

విస్తృత ఏర్పాట్లు

ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది చొప్పున సదస్సుకు 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. 23 దేశాల నుంచి 200 మందికిపైగా తెలంగాణ ప్రవాస శాఖల ప్రతినిధులు తరలిరానున్నారు. విద్యార్థి విభాగం నుంచి 15 వందల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోసం రుచికరమైన మాంసాహార, శాకాహార వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సభా ప్రాంగణంలో అంబలి, మజ్జిగ, మంచినీటి సరఫరా కేంద్రాలనుప్రారంభించారు. శుక్రవారమైనందున ముస్లిం సోదరుల నమాజ్‌ కోసంప్రత్యేక స్థలం కేటాయించారు.

RELATED NEWS

Comment